జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు కరోనా మహమ్మారిపై ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ సెంటర్లో కరోనా బారిన పడొద్దు అంటూ... రోడ్డుపై భారీ పెయింటింగ్ వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ వి. శ్రీనివాసులు హాజరయ్యారు.
ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని బయటకు వచ్చి కరోనా బారిన పడొద్దని పెయింటింగ్‌తో సందేశం ఇచ్చారు. కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా సేవలను కొనియాడారు.
ఏఆర్ కానిస్టేబుల్ సంపత్ రూపొందించిన కరోనా బొమ్మను డ్రోన్ ద్వారా ఎగరేస్తూ... బయటకు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. వంద మాటల్లో చెప్పలేని భావాలన్నీ ఒక్క చిత్రంలో చూడొచ్చని పెయింటింగ్ రూపకర్తలను అడిషనల్ ఎస్పీ అభినందించారు. అలాగే ప్రజలెవరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని... భౌతిక దూరం పాటించాలని సూచించారు.