గ్రామ ప్రగతి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి సభలు, పంచాయతీ సమావేశాలు కీలకం. ఇప్పటి వరకు మొక్కుబడిగా సాగినా.. ఇక నుంచి బాధ్యతాయుతంగా నిర్వహించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచిన విధంగా రెండు నెలలకోసారి గ్రామసభ, నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి. లేదంటే సర్పంచి పదవికి అనర్హులుగా ప్రకటిస్తారని చట్టం చెబుతోంది.
కోరం కచ్చితం
ఇదివరకు సభలకు ఎంతమంది వచ్చినా తూతూమంత్రంగా మమ అనిపిస్తూ ముగించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. గ్రామ సభకు జనాభాను బట్టి ప్రజల హాజరు ఉంటేనే నిర్వహించాలి. గ్రామాల్లో 500 ఓటర్లు ఉంటే 50 మంది, 3 వేల మంది ఓటర్లు ఉంటే 150 మంది, 5 వేల మంది ఓటర్లు ఉంటే 200 మంది, 10 వేల మంది ఓటర్లు ఉంటే 300 మంది, అంతకు మించి ఉంటే 400 మంది గ్రామసభలకు హాజరుకావాల్సిందే. కొత్త చట్టం ప్రకారం ఏడాదికి ఆరు సభలు నిర్వహించాలి. తేదీ సమయాలను ముందుగా ఊళ్లో ప్రచారం చేయించాలి. ఒకవేళ నిర్ణయించిన తేదీలో గ్రామ సభ జరుగకపోతే తిరిగి 10 రోజుల్లో నిర్వహించాలి. సర్పంచి లేకుంటే ఉప సర్పంచి ఆధ్వర్యంలోనైనా ఏర్పాటు చేయాలి.
పాలకవర్గాలపై బాధ్యత
పంచాయతీ ఆదాయ, వ్యయాలు ప్రజల ముందు ప్రవేశపెట్టాలి. ఊళ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్వహిస్తున్న సేవలపై చర్చించాలి. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఫిబ్రవరి 2న ఏర్పాటయ్యాయి. మార్చి చివరి నాటికి మొదటి సభ నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినా సభలు నిర్వహించకపోవడంతో పంచాయతీరాజ్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు ఏడాదికి నాలుగు సార్లు
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 73 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను చేర్చారు. వివిధ సంక్షేమ పథకాల విధులు పారదర్శకంగా నిర్వహించేలా గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి చేసేలా పంచాయతీ సమావేశాలు పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 14, జులై 1, అక్టోబరు 2, జనవరి 2 తేదీల్లో నిర్వహించేవారు. కొత్త చట్టం ప్రకారం ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభలు తప్పనిసరిగా నిర్వహించాలి. అదేవిధంగా పంచాయతీ పాలకవర్గాల సమావేశాలు నెలనెలా నిర్వహించాల్సిందే.
ఇదీ చూడండి : ప్రాణాలు నిలబెట్టిన ఎయిర్ బ్యాగ్స్