పిల్లలను పెంచి పెద్దచేయడం తల్లిదండ్రుల బాధ్యతైతే... వారిని అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవడమూ... ఆ బిడ్డల బాధ్యతే. ఆ బాధ్యత మరిచిన ఆ కొడుకు దగ్గర ఉండలేక... జీవితాన్నే చాలించారు వృద్ధ దంపతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం ఎలికేశ్వరలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
జీవిత చరమాంకానికి వచ్చిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవటం పలువురి మనసుల్ని కలచివేసింది. రాళ్ళబండి సాలయ్య(76), రాధమ్మ(66) దంపతులు... కొడుకుకోడలు సరిగా చూసుకోవట్లేదన్న మనస్తాపంతో పురుగులు మందు సేవించి బలవన్మరణం చెందారు.
అవమానాలు పడలేక...
సాలయ్య, రాధమ్మకు ఓ కొడుకు, ముగ్గురు కుమార్తెలు. కొడుకు కోడలు సత్తయ్య, సారక్క దగ్గరే ఈ వృద్ధ దంపతులు ఉంటున్నారు. కొడుకుకు ఇల్లు, ఆస్తి అంతా కట్టబెట్టారు. అయినా సరే వారి బాగోగులు చూసుకోకపోగా... పైనుంచి సూటిపోటి మాటలతో వారిని అవమానిస్తూ ఉండేవారు. ప్రశాంత జీవనం సాగించే వయసులో... రోజూ వారి మాటలతో చిత్రవధ అనుభవించలేక... చనిపోవాలని నిశ్చయించుకున్నారు.
చావు కూడా భారం కావొద్దని...
తమ బతుకే కాదు... చావు కూడా తన కొడుకుకు భారం కాకూడదనుకున్నారు ఆ పుణ్య దంపతులు. తమ అంతిమయాత్రకు కావాల్సిన మొత్తం సామగ్రిని ముందే తెచ్చిపెట్టుకున్నారు. కొత్తదుస్తులు తెచ్చి కట్టుకున్నారు. తమ చావుకు తామే ముహూర్తం పెట్టుకున్నారు. ఈ జీవితానికి ఇది చాలని.... ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు జంటగా వెళ్లిపోయారు.
ఆత్మహత్యతో గుణపాఠం...
వృద్ధ దంపతుల బలవన్మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారు చనిపోవటానికి చేసుకున్న ఏర్పాట్లను చూసి ఇరుగుపొరుగు గ్రామస్థులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు.
"తమ పిల్లలకు ఎన్నో పాఠాలు నేర్పిన ఆ తల్లిదండ్రులు... వారి ఆత్మహత్యతో సమాజానికి ఓ గుణపాఠం నేర్పిస్తూ... స్వర్గానికి చేరారంటూ.." స్థానికులు రోధించసాగారు.
ఇవీ చూడండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!