నీతి అయోగ్ ఆర్థిక సహకారంతో ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నీతిఅయోగ్ అధికారి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో విద్యా, వైద్యం, పౌష్టికాహారకల్పన, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆర్థిక తోడ్పాటు, మౌలిక వసతుల కల్పనల రంగాలలో అభివృద్ధికి నీతి అయోగ్ సహకారం అందిస్తుందని తెలిపారు.
ఆయా రంగాల అభివృద్ధికి గతంలోనే 10 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆ నిధులను సద్వినియోగం చేసుకొని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వైద్య-ఆరోగ్యం, పౌష్టికాహార కల్పన, విద్యా, వ్యవసాయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జరుగుతున్న అభివృద్ధి నివేదికలను ఎప్పటికప్పుడు నీతి అయోగ్‌కు అందించాలని అధికారులను ఆదేశించారు. 2019 మార్చిలో జిల్లా దేశ స్థాయిలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సూచికలో మొదటి స్థానాన్ని పొందిందని, ఇదేవిధంగా ప్రతి నెల అభివృద్ధి నివేదికలను అందించి జిల్లా అభివృద్ధికి సహకారం మరింతగా తీసుకోవాలని అన్నారు.