జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో దళితులపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు మూకుమ్మడిగా దాడి చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ అన్నారు. మహదేవపూర్ మండలం సూరారంలో పర్యటించిన ఆయన... 25 సంవత్సరాలుగా ఉంటున్న దళితుల గుడిసెలు కూల్చడాన్ని ఖండించారు. మూడెకరాల భూమి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ... ఎక్కడ పంపిణీ చేయపోవడమే కాకుండా... రైతువేదికల పేరుతో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో సూరారం గ్రామం సాక్ష్యంగా నిలుస్తుందని కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు, బెదిరింపులకు దళితులు తలొగ్గరని హితవు పలికారు. సెంటు భూమి తీసుకోవాలని చూసినా... రాజకీయాలు తారుమారు చేసి ప్రభుత్వాలని గద్దె దించే శక్తి దళితులకు ఉందని హెచ్చరించారు. సూరారం దళితులు గతంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు భూములు ఇచ్చారని... కానీ కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇవ్వకపోవడం వల్ల తెరాస తీసుకుంటుందన్నారు. పార్టీలకు అతీతంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు.