భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, కాటారం, మహముత్తారం, మల్హార్, పలిమేల మండలాల్లోని రైతులకు… సుమారు 45 వేల ఎకరాల్లో సాగు నీరందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై(chinna kaleshwaram project) ప్రభుత్వం అలసత్వం చూపుతుందని మంథని ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(mla sridhar babu) ఆరోపించారు.
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గారెపల్లి నూతన రిజర్వాయర్ను పరిశీలించి… ఇంకా పరిహారం అందని భూ నిర్వాసితులతో ఆయన ముచ్చటించారు. స్టేజ్-2 పంప్ హౌజ్ వద్ద ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ప్రాజెక్ట్ పురోగతి, సమస్యలపై సమీక్షించారు. తెరాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. ఈ ప్రాంతం నుంచి గోదావరి నీటిని తరలించుకు వెళ్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి మీనమేషాలు లెక్కించడం విచారకరమన్నారు. చిన్న కాళేశ్వరాన్ని త్వరగా పూర్తి చేసేలా సీఎం కేసీఆర్(CM KCR)కు ఎన్నో మార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా నాలుగు మండలాల్లో 14 చెరువులను రిజర్వాయర్లుగా ప్రతిపాదించారన్నారు. అవి త్వరగా పూర్తి అయ్యేలా చూడటంతో సహా… వాటి సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గారెపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పో యి పరిహారం రాని నిర్వాసితులకు వెంటనే అందించాలన్నారు.
రిజర్వాయర్లు, కాల్వల కోసం భూసేకరణ త్వరితగతిన చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఫోన్లో సూచించారు. స్టేజ్-2 పంప్ హౌజ్ వద్ద సబ్స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో మహదేవపూర్, మహముత్తారం, కాటారం అటవీ గ్రామాల్లో పర్యటిస్తూ కరోనా బాధితులకు ధైర్యం చెప్పారు. మహముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్(oxygen concentrator) పంపిణీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లు, తదితర సామగ్రిని ఎమ్మెల్యే అందించారు.
ఇదీ చూడండి: talasani: 'నాలాల్లో పూడిక తీసేందుకు 45 కోట్లు ఖర్చు'