ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల ఫలాలు.. ఇక నుంచి పార్టీ కార్యకర్తల చేతులమీదుగా అందుతాయని తెరాస ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మీ, రుణమాఫీ వంటి పలు పథకాల చెక్కులను.. కార్యకర్తలు, నాయకులే నేరుగా వెళ్లి లబ్ధిదారులకు అందజేస్తారని వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై.. శ్రేణులకు సభ్యత్వం అందించారు.
సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గం నుంచి దాదాపు 80వేల సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభవం వ్యక్తం చేశారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, లక్ష్మణరావు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కల్యాణలక్ష్మికి ఇబ్బందులు... నిలిచిన 1.12 లక్షల దరఖాస్తులు