జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుబంధు, రైతు రుణమాఫీ చేసేందుకు నిధులు విడుదల చేసినందుకు గాను పాలాభిషేకం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలందరికీ 1500 రూపాయలు, బియ్యం, పప్పు పంపిణీ చేస్తున్న సీఎం కేసీఆర్ మనసు గొప్పదని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని అన్నారు. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్కులు వాడాలని అలాగే భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్