తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఇవాళ ఉదయం 10 గంటలకు గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, రక్షాబంధనం, నవగ్రహ, కలశ ఆరాధన, అగ్ని ప్రతిష్ట పూజలతో ఆలయ అర్చకులు ఉత్సవాలు ప్రారంభించారు. ఈ రోజు రాత్రి స్వామివారి ఊరేగింపు, ఎదుర్కోలు సేవ జరపనున్నారు.
శుక్రవారం సాయంత్రం 4గంటల 26నిమిషాలకు శ్రీ ముక్తీశ్వర స్వామి, శుభనంద కల్యాణం, రాత్రి 12 గంటలకు మహాఅభిషేకం, లింగోద్భవ పూజ, ఛండీహవనము, కాళరాత్రి హవనము, విశేష పూజలు జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా... మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున... గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: భయపడే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు: శైలజాకిరణ్