Kaleshwaram Lift Irrigation Project : కాళేశ్వరం ద్వారా దిగువ గోదావరి జలాల ఎత్తిపోత కొనసాగుతోంది. మేడిగడ్డ మొదలు రంగనాయక్ సాగర్ వరకు పంప్ హౌస్‌ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. అటు పునరుజ్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్‌లోకి కూడా గోదావరి జలాలు చేరుతున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోశారు.
వర్షాభావ పరిస్థితుల్లో తాగు, నీటి అవసరాల కోసం ప్రాణహిత ద్వారా వచ్చే ప్రవాహాన్ని పూర్తిగా ఎత్తిపోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపు కొనసాగుతోంది. ప్రాణహిత నది ద్వారా వస్తున్న ప్రవాహం ప్రాజెక్టులో మొదటి ఆనకట్ట అయిన మేడిగడ్డ వరకు చేరుతున్నాయి. ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్కులుగా ఉంది. కిందకు వదలకుండా ఆ నీటిని లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోస్తున్నారు.
Kaleshwaram Project Water Lifting : లక్ష్మీ పంప్ హౌస్‌లోని 7 మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఎగువన ఉన్న సరస్వతి, పార్వతి పంప్ హౌస్‌ల్లోని 6 చొప్పున మోటార్లను నడిపిస్తూ జలాలను ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఆ నీటిని కూడా ఎప్పటికప్పుడు ఎగువకు తరలిస్తున్నారు. ఇందుకోసం నంది పంప్ హౌస్‌లో రెండు మోటార్లను నడుపుతున్నారు. గాయత్రి పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్లలో కూడా రెండింటి ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. ఆ తర్వాత సగం నీటిని మధ్యమానేరుకు... మిగిలిన సగం నీటిని పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాల్వ ద్వారా ఎస్సారెఎస్పీకి తరలిస్తున్నారు. మధ్య మానేరు జలాశయంలోకి వస్తున్న జలాలను అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ పంప్ హౌస్‌ల్లోని ఒక్కో మోటార్ ద్వారా ఎత్తిపోస్తున్నారు.
పునరుజ్జీవ పథకంలో భాగంగా రాంపూర్, రాజేశ్వరరావు పేట, ముప్కాల్ వద్ద ఉన్న పంప్ హౌసుల్లోని నాలుగు చొప్పున మోటార్ల ద్వారా శ్రీరాంసాగర్‌లోకి నీటిని తరలిస్తున్నారు. గత యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 35 టీఎంసీల నీటిని ఎగువకు తరలించినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఆ నీటితో కాల్వలు, చెరువుల కింద 21 లక్షల ఎకరాలకు పైగా నీరు అందిందని అంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 6 టీఎంసీల వరకు నీటిని ఎగువకు ఎత్తిపోశారు.
ప్రస్తుతం మేడిగడ్డకు వస్తున్న ప్రవాహాలు 30 వేల క్యూసెక్కులుగా ఉండగా.. లక్ష వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరింత ఎక్కువ నీటిని ఎత్తిపోయవచ్చని భావిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే కొద్దీ ఎక్కువ సంఖ్యలో మోటార్లను.. ఎక్కువ సేపు నడిపి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
ఇవీ చదవండి: