జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 200 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని... జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులకు సూచనలు చేశారు. యాసంగిలో జిల్లాలో పండించిన వరిధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వరి ధాన్యం కోతకు వస్తున్న నేపథ్యంలో ఈ నెల మూడవ వారంలోగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... మద్ధత ధరతో కొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గ్రామాల వారీగా ఆయాకేంద్రాలకు కేటాయించిన రైతులకు టోకెన్లు జారీ చేసి కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని... ధాన్యం రవాణాకు ఇబ్బంది కలగకుండా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయాలన్నారు. శానిటైజర్లు, తాగునీరు తదితర వసతులను కల్పించాలన్నారు. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియలో విధులు నిర్వహించే అన్ని స్థాయిల అధికారులకు, సిబ్బందికి ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతు కల్లాల నిర్మాణం వేగవంతం చేయాలని... అవసరమైతే గ్రామపంచాయతీ నిధులు అందుబాటులో ఉన్న గ్రామాల్లో నిధులను ఉపయోగించాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రైతు అని చెప్పుకోవడానికి భయపడే రోజులుండేవి: మంత్రి జగదీశ్‌రెడ్డి