రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ పాల్గొన్నారు. జిల్లాలో అందరి సహకారంతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 45 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణ పనులను ప్రారంభించామని... అవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించాడు.
జిల్లా వ్యాప్తంగా 241 గ్రామ పంచాయతీల పరిధిలో గల 382 ఆవాస గ్రామాలలో ప్రకృతి వనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని గ్రామాల్లో సమీప అటవీ స్థలాలు, దాతల ద్వారా సేకరించిన స్థలాలలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో గల ఏకైక మున్సిపాలిటీ భూపాలపల్లి పట్టణంలో 1533 మంది వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. డీపీఓ, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బంధీగా జరిగేలా చూడాలన్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్మాణం వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్, పంచాయతీరాజ్ ఇఇ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.