జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కర్మాగారంలో తయారయ్యే పల్పునకు అంతర్జాతీయ మార్కెట్లో క్రమక్రమంగా మద్దతు ధర పడిపోవడంతో.. అది ఆరేళ్ల కిందట (2014) మూతపడింది. దాంతో దానిపై ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
నాడు వెలుగులు నేడు కన్నీళ్లు..
వేతనాలు నిలిపివేయడంతో కార్మికుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. పిల్లలను చదివించుకోలేక, కుటుంబాన్ని పోషించలేక వారు కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా.. ఇతర పనులు చేసుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. సరైన వైద్యం చేయించుకోలేక కొందరు మృత్యువాత పడితే.. ఆర్థిక బాధలను తట్టుకోలేక మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
వట్టి హామీలే..
ప్రభుత్వాలు మారాయి. నేతలూ మారారు. కాని వారి తలరాత ఏ మాత్రం మారలేదు. కర్మాగారాన్ని తెరిపిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల ముఖ్య నేతలు ఇచ్చిన హామీలు ఫలించలేదు.
ప్రభుత్వ రాయితీలు..
రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్ పునరుద్ధరణ కోసం యాజమాన్యానికి 2015 ఏప్రిల్‌లో రూ. 210కోట్లు రాయితీ ప్రకటించింది. కానీ యాజమాన్యం ఎంఓయూ కుదుర్చుకోలేదు. పలు కారణాల వల్ల యాజమాన్యం మళ్లీ రాయితీలు పెంచమని కోరడంతో.. ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో మరోసారి రూ. 300కోట్లను ప్రకటించింది. కానీ యాజమాన్యం మళ్లీ వెనుకడుగేసింది. కారణం.. యాజమాన్యం అప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. ఫలితంగా 2018లో ఐడీబీఐ అధికారులు కర్మాగారం ఎదుట నోటీసులు అంటించారు. రూ. 551కోట్లు అప్పు చెల్లించని కారణంగా.. కంపెనీని అధీనంలోకి తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల.. యాజమాన్యం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను సంప్రదించింది. ఆ మేరకు ట్రైబ్యునల్.. 'ఇన్సాల్వెన్సీ రీసాల్వెన్సీ' ప్రాసెస్‌ను ఏర్పాటు చేసింది. అందులో వివిధ బ్యాంకులు.. బిల్ట్ అప్పుల వివరాలను సమర్పించాయి.
పునః ప్రారంభానికి నోచుకుంటుందా..?
ఈ అప్పుల ఊబి నుంచి కర్మాగారం బయటపడుతుందా? దీన్ని పునః ప్రారంభించాడానికి ప్రభుత్వమేమైనా సాయ పడుతుందా? ఎన్నాళ్లైనా.. కర్మాగారాన్నే నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చదవండి: మరో సాహస క్రీడకు వేదికగా భువనగిరి ఖిల్లా..