రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కరకట్ట నిర్మాణాల మట్టిని కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతం, సమీప గ్రామాల శివారు ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణం కిలోమీటర్ల మేర ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పలు ఇసుక క్వారీలు సాగుతున్నాయి. గతంలో బ్యారేజీలో నీటి నిల్వతో క్వారీలను నిలిపివేయగా, మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని కొందరు గుట్టు చప్పుడు కాకుండా కరకట్టల మట్టిని అక్రమంగా తవ్వి ఇసుక క్వారీలలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మట్టి తవ్వకాల ఆనవాళ్లు బయటకు తెలియడంతో సంబంధిత వ్యక్తులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయంపై మహదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మేడిగడ్డ బ్యారేజీ ఇంజినీరింగ్ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న అనిల్ రావిపూడి