జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీపీఎస్ ఉపాధ్యాయుడు కొడారి తిరుపతి కుటుంబాన్ని తాము ఆదుకుంటామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రఘోత్తం రెడ్డి అన్నారు. జిల్లా టీచర్లు విరాళాల ద్వారా సేకరించిన రూ. 1,25,000ను తిరుపతి కుటుంబ సభ్యులకు అందజేశారు.
కొడారి తిరుపతి.. తెలుగు టీచర్‌గా వైన్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసేవారు. అనారోగ్యంతో ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు.. శనివారం సాయంత్రం తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) కింద ఉన్న తిరుపతికి ఉద్యోగ పరంగా ఎలాంటి ప్రయోజనాలు రావని జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆయన కుటుంబాన్ని తమ సంఘం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
సీపీఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు లేవని జనార్ధన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు అనారోగ్యంతో చనిపోతే, వారి కుటుంబానికి తదనంతర పింఛను, పీఎఫ్ వంటి ప్రయోజనాలు పొందే అవకాశం లేదని చెప్పారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: చిట్టంపల్లి మృతుల కుటుంబాలకు మంత్రి పరామర్శ