జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రైతుల సమస్యలపై జిల్లా భాజపా సంఘీభావ ఉపవాస దీక్ష చేపట్టింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నం యుగంధర్, అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు ఇచ్చేంతల విష్ణు దీక్షలో కూర్చున్నారు. లాక్ డౌన్ సమయంలో రైతులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని నేతలు మండిపడ్డారు. అనేక మండలాల్లో నేటికీ ఐకేపీ సెంటర్లను ప్రారంభించలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదని మండిపడ్డారు.
రైతుల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు ఎద్దేవా చేశారు. ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ చందుపట్ల కీర్తి రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసరు విజయ్ చందర్ రెడ్డి హాజరయ్యారు.