A Husband killed Wife and Daughter: మద్యం మత్తు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. ఓ వైపు మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు తాగిన మైకంలో విచక్షణ కోల్పొతున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడానికి లేదా ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. ఫలితంగా తమతో పాటు ఇతరుల జీవితాలను కడతేరుస్తున్నారు.
తాజాగా మద్యం మత్తు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. తాగిన మైకంలో విచక్షణ కోల్పొయి.. మానవత్వాన్ని మంటగలిపింది. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను కడతేర్చేలా చేసింది. ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భూపాలపల్లి మండలం వేశాలపల్లి గ్రామానికి చెందిన ఎలగంటి రమణాచారికి భార్య, ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలోనే అతను మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో ప్రతిరోజు భార్యతో గొడవపడేవాడు. దీనిపై ఆమె పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా రమణాచారి తన వైఖరి మార్చుకోలేదు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి రమణాచారి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.
మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని: మళ్లీ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని రమణాచారి భార్యతో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రమణాచారి ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య రమను నరికాడు. అడ్డుకోవడానికి వెళ్లిన కుమార్తె చందననూ కిరాతకంగా చంపాడు. ఇది చూసి కుమారుడు కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి బాలుడిని కాపాడారు. చందన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: బుధవారం ఇంటర్ పరీక్షలు రాసి చందన ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే తండ్రి చేతిలో హతమవడం అక్కడి వారిని కలిచివేసింది. పోలీసులు రమణాచారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తల్లిని, అక్కను కోల్పోయిన బాలుడి ఆవేదనను చూసి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: కోరిక తీర్చమని యువకుడి వేధింపులు.. పక్కా ప్లాన్‌తో మర్డర్ చేసిన యువతి
క్షణికావేశంలో భర్త ఆత్మహత్యాయత్నం.. మనస్తాపంతో తల్లీకుమార్తె బలవన్మరణం
గుడిలో 12 మంది భక్తులు మృతి.. రామనవమి వేడుకల్లో పెను విషాదం
'సర్ప్రైజ్ ఇస్తా.. కళ్లు మూసుకో' అని కత్తితో పొడిచి హత్య.. శవాన్ని ముక్కలు చేసి..