జనగామ జిల్లాలో మామిడి తోటలు పెంచుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తోటలు నిర్వహించినా తీరా కాయ కోతకు వచ్చే సరికి, అంగట్లోకి వెళ్లే వరకు ఎన్నో ఇబ్బందులు చవిచూస్తున్న మామిడి రైతులకు సరికొత్త రకం పరిచయం చేయనున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2,301 మంది రైతులు 9,080 ఎకరాల్లో మామిడి తోటలను నిర్వహిస్తున్నారని ఉద్యానవన శాఖాధికారి లత తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు ఫల పరిశోధన కేంద్రంలో పెంచుతున్న హిమాయత్ రకం గురించి వ్యక్తిగత ఆసక్తితో తెలుసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో కూడా పరిస్థితులకు అనుగుణంగా అందించేలా ఏర్పాటు స్తామని తెలిపారు.
హిమాయత్ రకం మామిడి సాగు
- మామూలు రకాలకు భిన్నంగా అతి తక్కువ ఎత్తు పెరిగి రెండేళ్లకే కోతకు వచ్చే హిమాయత్ రకం మామిడిని అంటుకట్టడం వల్ల నాటుతారు.
- ఆరు నెలల నుంచి పెరిగే కొమ్మలను తొలగిస్తూ సస్యరక్షణ చేస్తారు.
- హిమాయత్ రకం చెట్ల ఎత్తు తక్కువ ఉండడం వల్ల గాలి దుమారం వల్ల కాయ రాలిపోవడం, తెంపే సమయంలో ఎత్తు మీద నుంచి కిందపడి దెబ్బతినడం ఉండవని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో డిమాండు
ఎకరా విస్తీర్ణంలో 660 మొక్కలను నాటితే ఏడాదికి అర లక్ష రూపాయలకు మించి ఖర్చవదని అధికారులు తెలిపారు. రెండో ఏడాది నుంచే కాతకు వస్తుందని, దీనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండు ఉందని పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా