జనగామ జిల్లా పెంబర్తి వద్ద గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ - హన్మకొండ రహదారిపై రోడ్డు నిర్బంధం చేపట్టారు. గొల్ల, కురుమలను కోటీశ్వరులను చేసేందుకు గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందని ధర్నాకు దిగారు. అప్పులు చేసి మరీ డీడీలు కట్టి మూడేళ్లు గడుస్తున్నా.. వాటిని ఖజానాలో జమ చేసుకున్న సర్కారు ఇంతవరకు రెండో విడత గొర్రెలను పంపిణీ చేయలేదని సంఘం నాయకులు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా డీడీలు కట్టిన 28 వేల మంది తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎన్ని విధాల ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని.. ఇప్పటికైనా స్పందించాలని.. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండిః గొర్రెలు పంపిణీ చేయాలంటూ రహదారిపై ఆందోళన