ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో పురపోరు ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన... మంచు, చలి కారణంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వైపు చూడలేదు. చాలా కేంద్రాలు ఓటర్లు లేక నిర్మానుషంగా కనిపించాయి. ఆ తర్వాత గంట సేపటికి మెళ్లగా ఓటర్లు రావడం వల్ల పోలింగ్ కేంద్రాలకు కళ వచ్చింది. మహిళలు, వృద్ధులు ఉత్సహంగా వచ్చి ఓటును వినియోగించుకోవడం వల్ల ఓటింగ్ శాతం పెరిగింది. జిల్లా కలెక్టర్లు, నగర పోలీస్ కమీషనర్, ఎస్పీలు ఎక్కడిక్కడ పోలింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.
అందరికి ఆదర్శం ఆ యువతి...
జనగామలోని 3వ వార్డుకు చెందిన ప్రత్యుషా రెడ్డి కజకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చదువుతుంది. ఆమెకు తొలిసారి ఓటు హక్కు రావడం వల్ల జనగామకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని... అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇదే మున్సిపాలిటీలోని 25వ వార్డుకు చెందిన రంగు శ్రీనివాస్ వెన్నుముఖ విరుగడం వల్ల అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రంకు వచ్చి ఓటు వేశారు.
పలు చోట్ల స్వల్ప ఘర్షణలు...
మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 36వ వార్డులో తెరాస, సీపీఐ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అలాగే పరకాల మున్సిపాలిటీలోని 21వ వార్డులో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేశారు.
జనగామ పురపాలికలోని 19వ వార్డులో ఓటు వేస్తూ సెల్ఫీ దిగిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే వార్డులో తెరాస అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో తరుచు తిరుగుతున్నాడని భాజపా అభ్యర్థి ఆరోపించడం వల్ల ఇద్దరి మధ్య స్వల్ప వాదులాట జరిగింది. పరకాల 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గంధం సమ్మయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పోలింగ్ కేంద్రంలో విద్యుత్ అంతరాయం...
వర్థన్నపేట మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెందిన భవాని కుంట తండాలోని పోలింగ్ కేంద్రంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీనికి తోడు పోలింగ్ కేంద్రం ఇరుకుగా ఉండటం వల్ల ఓటర్లకు ఇబ్బందిగా మారింది. కొంత మంది ఓటర్లు వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది.