BRS Jangaon MLA Ticket To Palla Rajeshwar Reddy : అందరూ ఊహించినట్లుగానే.. జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే వరించనుంది. రానున్న ఎన్నికల బరిలో జనగామ నుంచి పల్లానే బరిలో నిలబడనున్నారు. కొంతకాలంగా.. ఈ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ పల్లాకు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య వివాదం నడుస్తున్నప్పటికీ.. మంత్రి కేటీఆర్ సయోధ్యతో అది సద్దుమణిగింది. జనగామలో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ తర్వాత.. పల్లా ప్రచార పర్వంలోకి దిగనున్నారు.
Minister KTR With Jangaon BRS Leaders : జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. అభ్యర్థిత్వంపై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ పల్లా, జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే మొదటిసారి. పల్లా గెలుపునకు సహకరించాలని.. నియోజకవర్గ గులాబీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. జనగామ టిక్కట్ ఆశించిన పలువురు నియోజకవర్గ నేతలతో కూడా కేటీఆర్ సమావేశమై.. పల్లాను గెలిపించుకోవాలన్నారు.
నెల రోజుల కిందట దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం.. జనగామతో పాటు పలు నియోజకవర్గాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ముత్తిరెడ్డి అనుచరులు రోడ్డెక్కి పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. కానీ ఆది నుంచీ జనగామ నుంచి ఎన్నికల బరిలో నిలవాలనుకున్న పల్లా.. తన పంతం నెగ్గించుకున్నారు. నియోజకవర్గంలో ఆందోళనలు, కేటీఆర్ అమెరికా పర్యటన కారణంగా పల్లా అభ్యర్థిత్వం కాస్త ఆలస్యమైంది. ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడంతో అన్ని ఊహలకు తెర దించినట్లయింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆలస్యం చేయకుండా.. మంత్రి కేటీఆర్ తన నివాసంలో ముత్తిరెడ్డి, పల్లా మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మద్దతుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.
TSRTC New Chairman MLA Muthireddy Yadagiri Reddy : జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టారు. దీంతో ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి రెండు రోజుల క్రితం టీఎస్‌ఆర్టీసీ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.