మెప్మా పరిధిలోని వీధివ్యాపారులకు వంద శాతం రుణాలను వారంలోగా మంజూరు చేయాలని అధికారులను జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పురపాలిక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, పార్కుల అభివృద్ధి, రెవెన్యూ సెక్షన్ కింద ఉన్న ఇంటిపన్ను, నల్లా పన్నులను సకాలంలో వసూలు చేయాలని ఆదేశించారు.
ప్రధాన రహదారుల్లో చెత్త వేసే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి అధిక మొత్తంలో జరిమానా విధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు వార్డులు పర్యటించి పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు. చెత్తసేకరణ సరిగా జరిగే విధంగా చెత్తసేకరణ వాహనాల బీపీఎస్ సిస్టమ్‌ను పరిశీలించాలన్నారు. వార్డు కమిటీ సభ్యులందరూ పర్యవేక్షణలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, పురపాలిక కమిషనర్ సమ్మయ్య, డీఈఈ రవీంద్రనాథ్, టీపీవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'