జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్ మండలాల్లో గురువారం సంభవించిన అగ్నిప్రమాదంలో పలువురు రైతులకు సంబంధించిన గడ్డివాములు దగ్ధం కాగా.. సమీపంలోని పశువుల కొట్టాల్లో కట్టి వేసిన పశువులు అగ్ని కీలలకు మృత్యువాత పడ్డాయి.
చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన గడ్డివాములు కాలిపోయాయి. సమీపంలోని విద్యుత్ నియంత్రికల నుంచి ఎగిసిపడ్డ నిప్పు రవ్వల వల్ల ఎండవేడిమికి పొలాల్లోనే గడ్డి అంటుకుంది. దీంతో మంటలు సమీపంలోని గడ్డివాములకు వ్యాపించాయి.
అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని చంద్రు తండాలో 8 గడ్డివాములు ఇదే తరహాలో మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలోని పశువుల కొట్టాల్లో కట్టివేసిన మూడు పశువులు మంటల వేడికి తాళలేక మృత్యువాత పడ్డాయి. అగ్నిమాపక ఇబ్బందికి సమాచారం అందించగా వారు అందుబాటులో లేకపోవడం వల్ల భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక వాహనం లేకపోవడం వల్ల గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
ఇవీ చూడండి: భానుడి భగభగలకు దగ్ధమవుతున్న గడ్డివాములు