రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. పోలీసుల సహాయంతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా కరిమాబాద్ ఉర్సు దర్గా ఎదుట 4 రోజుల క్రితం కూల్చివేతకు గురైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ స్థలాన్ని సందర్శించేందుకు వెళ్తున్న వీహెచ్‌ను పెంబర్తి వద్ద జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను లింగాల ఘన్‌పూర్ ఠాణాకు తరలించారు.
దుండగులు ధ్వంసం చేసిన విగ్రహ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం సరైంది కాదని వీహెచ్ మండిపడ్డారు. ఇలా అక్రమ అరెస్టులు చేయడం కన్నా.. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి పాలన సాగించుకోవాలంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పీవీ నరసింహరావు విగ్రహాలు పెడతామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం.. మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా పాటించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.