రైతు అలిగితే దేశానికి తిండిపెట్టే పరిస్థితి ప్రపంచంలో ఎవరికీ ఉండదని ప్రధాని మోదీకి చెప్పినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు, రైతులను, వ్యవసాయాన్ని ఆదుకోవాలని అనేకసార్లు ప్రధానికి సూచించినట్లు వెల్లడించారు. దేశానికి ప్రమాదం వస్తే ఆదుకునే శక్తి రైతులకే ఉందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామని చెప్పారు. రైతులను కాపాడుకోవడానికి పిడికిలి బిగించి యుద్ధానికి కదలాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొడకండ్ల మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ఇతర దేశాల్లో రైతులకు రాయితీలు ఇస్తుంటారని సీఎం తెలిపారు. మన దేశంలో రాష్ట్రాలు సబ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఒప్పుకోవట్లేదని విమర్శించారు. రైతులకు ఎక్కువ ధర ఇస్తే మీ వడ్లు తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెబుతోందని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు అధిగమించి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. సన్నరకాలు సాగుచేయమని సూచించానని.. తప్పకుండా మద్దతు ధర వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్