మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లన్నీ మాంసాహార ప్రియులతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ తెల్లవారుజాము నుంచే ప్రజలతో రద్దీగా కనిపించింది. మృగశిర కార్తె రోజు చేపలను ఆహారంగా తీసుకుంటే సంవత్సరంపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున చేపల మార్కెట్ ప్రజలతో నిండిపోతుంది. కోనుగోలుదారుల కోసం మార్కెట్లో మత్స్యకారులు వివిధ రకాల చేపలను విక్రయానికి ఉంచారు. వాటిని కొనేందుకు ప్రజలు సైతం ఆసక్తిగా ఎగబడ్డారు. చేపల కోసం మాంసాహారులు పెద్దఎత్తున తరలిరావడం వల్ల అమ్మకందారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారని కొనేవారు వాపోయారు.
కరోనా ప్రభావంతో చేపల మార్కెట్లో పలు నిబంధనలు విధించినా.. ప్రజలు వాటిని పట్టించుకోలేదు. చాలామంది భౌతిక దూరం పాటించకుండా.. మాస్క్ ధరించకుండా చేపల కోసం ఎగబడ్డారు. అమ్మకందారులు కూడా మాస్కులు లేకుండానే అమ్మకాలు సాగించారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలతో వచ్చినవారు మార్కెట్ పరిస్థితి చూసి.. ఆందోళనకు గురయ్యారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా