Paddy Procurement: ధాన్యం అమ్మకం కోసం రైతులకు తిప్పలు (Paddy Procurement) తప్పటం లేదు. 17తేమ శాతం కోసం రైతు పడరాని పాట్లు పడుతుంటే. మార్కెట్ యార్డులో మౌలిక వసతుల లేమి కర్షకులను వెక్కిరిస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ (Metpally Market Yard)లో ఈనెల 9న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 760 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌లో సుమారు 5 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండడంతో ధాన్యం కుప్పలపై పాలథిన్ కవర్లను కప్పి వాటిపై బండరాళ్లను ఏర్పాటు చేసుకొని అన్నదాతలు రక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
15 రోజులుగా...
నిర్మల్ జిల్లాలో 15 రోజులుగా వరి కొనుగోళ్ల (Paddy Procurement) కోసం రైతులు కల్లాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో లక్షా 3 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా లక్షా 30 వేల 385 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఆ ధాన్యం కొనేందుకు జిల్లావ్యాప్తంగా 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 183 చోట్ల కొనుగోళ్లు ప్రారంభించారు. రోజులు గడుస్తున్నా అక్కడ నుంచి పంటను తరలించకపోవడం వల్ల పలువురు రైతులు మార్కెట్ కేంద్రాల వద్దే జాగారం చేస్తున్నారు.
వర్షాల కారణంగా 80 శాతం కోతలు కాలేదని చెబుతున్న రైతులు... పూర్తిస్థాయిలో ధాన్యం కల్లాలకు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.