Kazipet Railway Over Bridge Works : కాజీపేట రెండో వంతెన పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సామగ్రి ఛత్తీస్‌గఢ్ నుంచి ఓరుగల్లుకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు సంకల్పంతో పనులను వేగవంతం చేసేలా కార్యచరణ రూపొందించారు. ఇది పూర్తయితే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఇరుకైన పాత వంతెనపై ప్రయాణిస్తూ నానా ఇబ్బందులు పడ్డ వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగరి వాసుల ప్రయాణ ఇక్కట్లు త్వరలో తీరనున్నాయి. మూడేళ్లుగా సాగుతూ ఆగుతూ వస్తున్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు మళ్లీ మొదలుకానున్నాయి. కాజీపేట వంతెన నిర్మాణం ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు.
మార్చికల్లా కొంత బ్రిడ్జి అందుబాటులోకి : ఎంపీ కడియం కావ్య సైతం వంతెన ఆవశ్యకతను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫలితంగా పనుల్లో కదలిక వచ్చింది. బిలాయి ఉక్కు పరిశ్రమలో తయారైన గడ్డర్లు కాజీపేటకు చేరుకున్నాయి. వంతెన స్లాబ్ నమూనా, రైల్వే ట్రాక్‌పై నిర్మించే పనులను ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. మార్చికల్లా కొత్త వంతెన పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని జిల్లా ప్రజాప్రతినిధలుు చెపుతున్నారు.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు : వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి నుంచి జనగామ, భువనగరి, హైదరాబాద్ వెళ్లాలంటే కాజీపేట వంతెన మీదుగా వెళ్లాల్సిందే. 1976లోనే మొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కాలక్రమంలో క్రమేపీ రద్దీ పెరగ్గా వంతెన ఇరుగ్గా మారింది. అవసరాల రీత్యా మరో వంతెన నిర్మాణం కోసం 78 కోట్ల రూపాయలతో 2021లో పనులు ప్రారంభించినా అవి నత్తనడకసాగుతున్నాయి.
రైలు పట్టాలపైన చేయాల్సిన పనులు నిలిచిపోయాయి. ఇవి జరగాలంటే. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలి. దిల్లీ చెన్నై మార్గం కావడం వల్ల రైల్వే అధికారులు,ఆర్ అండ్ బీ, గుత్తేదారు సంస్థ అందరూ సమన్వయంతో చేస్తేనే పనులు సకాలంలో పూర్తవుతాయి. రెండో వంతెన పూర్తయితే వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరతాయని త్రినగరి వాసులు కోరుకుంటున్నారు.
హైదరాబాద్‌లో త్వరలోనే మరో స్కైవాక్ - ఆ ప్రాంత వాసులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు!