జగిత్యాల జిల్లా రాయికల్‌లోని రైతు ముఖాముఖి కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. వ్యవసాయ చట్టంపై రైతుల అనుమానాలను నేరుగా నివృత్తి చేశారు. వరి, మొక్కజొన్నకు మద్దతు ధర ఉన్నప్పుడు.. తెలంగాణలో పసుపు పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నూతన వ్యవసాయం చట్టం ద్వారా రైతులకు 65 శాతం మేర లాభం చేకురుతుందన్నారు. దళారి వ్యవస్థ అనేది ఉండదని రైతులకు ఆయన వివరించారు. పంటల బీమా కూడా వస్తుందని, మార్కెట్‌కు చెల్లించే ఒక శాతం తప్పుతుందన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు ఎమ్మెల్యేలకు మాముళ్లు ఇచ్చి రైతుల నుంచి 10 శాతం మేర దోచుకున్నారని అర్వింద్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో పండించిన పంటలను మాత్రం రిలయన్స్‌కు అమ్ముకోవచ్చని.. రైతులు మాత్రం అమ్ముకోవద్దా అని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లుతో పసుపునకు 16 వేల క్వింటాళ్ల ధర దక్కుతుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలు వ్యవసాయ చట్టంతో ఏమో జరగబోతున్నట్లు రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని.. చట్టం ద్వారా అన్నదాతలకు మంచి మేలు జరుగుతుందని అర్వింద్ వెల్లడించారు.
ఇదీ చదవండి: దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు