జగిత్యాల జిల్లాలో మెట్పల్లి పురపాలక సంఘం మూడో గ్రేడ్‌గా కొనసాగుతోంది. గత మూడేళ్లుగా పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుని ఆదర్శ మున్సిపాలిటీగా పేరు తెచ్చుకున్న మెట్పల్లిలో మౌలిక వసతులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.
చినుకు పడితే చిత్తడే!
పన్నుల వసూళ్ల మీద పెట్టిన శ్రద్ధ అధికారులు ప్రజాసమస్యలపై పెట్టకపోవడం వారికి శాపంగా మారింది. పురపాలక పరిధిలోని 26 వార్డుల్లో సీసీరోడ్లు లేక చినుకు పడితే చాలు రహదారులు దుర్భరంగా మారుతున్నాయి. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచి చెరువుల్ని తలపిస్తున్నాయి.
పట్టించుకునే వారే లేరా!
చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదగుంటలా తయారవ్వడం వల్ల పిల్లలు నడుస్తున్నప్పుడు జారిపడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట వచ్చేవారు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా స్పందించండి!
కొన్ని వీధుల్లో ఇప్పటికి మురికి కాలువలు నిర్మించకపోవడం వల్ల వాన పడినప్పుడు నీరు నిలిచి రోగాల బారిన పడుతున్నారు. మెట్పల్లి మున్సిపాలిటీని పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతున్న అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత