Metpally Municipal office Paints : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక కార్యాలయం పట్టణ ప్రజలకు కనువిందు చేస్తోంది. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చేప్రజలకు కార్యాలయం రంగురంగుల చిత్రాలతో ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ చిత్రాలు గీయించారు. ఆ విధంగా ప్రభుత్వ పథకాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు... గోడలకు వేసిన చిత్రాలను చూస్తూ అవగాహన తెచ్చుకుంటున్నారు . అధికారులు చేసిన ప్రయత్నంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన కోసమే..
టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించి... పురపాలక కార్యాలయంతో పాటు పట్టణంలోని పోలీస్ స్టేషన్, సబ్ కలెక్టర్ కార్యాలయం, అగ్నిమాపక కార్యాలయం, కోర్టు ఇలా వివిధ ప్రభుత్వ కార్యాలయ గోడలపై ఆయా శాఖలకు సంబంధించిన చిత్రాలను గీయించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి... చిత్రాల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
గోడలపై అందమైన బొమ్మలు
నీటిని పొదుపుగా వాడండి.. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.... హరితహారం అందరి బాధ్యత.... మాస్కులు ధరించి కరోనా రాకుండా చేద్దాం. ఇలా ఎన్నో విభిన్నమైన సూక్తులతో చిత్ర రూపంలో గోడలపై బొమ్మలు గీయించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పురపాలక అధికారులు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం కొందరిలోనైనా మార్పు తీసుకొస్తుందని స్థానికులు అంటున్నారు.
రూ.20 లక్షల నిధులు కేటాయించి కార్యాలయాల్లో చిత్రాలు గీయించాం. పట్టణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టినం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తడి-పొడి చెత్త వేరు చేయడం, నీరు వృథా చేయకూడదని ఇలా రకరకాల సందేశాలు చిత్రాల రూపంలో వేయించాం. ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
-సమ్మయ్య, పురపాలక కమిషనర్
ఇదీ చదవండి: student welfare fund: ఈ సర్కార్ బడి ప్రైవేట్ స్కూళ్లకే ఆదర్శం