జగిత్యాల జిల్లాలో బీడీల తయారీ, కంపెనీల నిర్వహణ, భవన నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్, సిరామిక్, సిమెంట్, కాటన్ బేకరీలు, కిరణా, ఔషధ, ఇనుము, స్టీల్, ప్లాస్టిక్, శానిటరీ, చేనేత, టైల్స్ తయారీ, కాగిత పరిశ్రమ, తదితర పరిశ్రమలతోపాటు సంబంధిత దుకాణాలను నిర్వహించుకోడానికి లాక్‌డౌన్ నుంచి అనుమతి లభించింది. వరి కోత యంత్రాల మరమ్మతుల దుకాణాలు, వాటి సామాగ్రి అమ్మే దుకాణాలు, ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
బీడీ పరిశ్రమతో ఉపాధి
జగిత్యాల జిల్లాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది బీడీ పరిశ్రమపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 18 మండలాల్లో వివిధ కంపెనీలు 34 వరకు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 551 వరకు బ్రాంచీలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం గుర్తింపు పొందిన బీడీ కార్మికులు 69,067 మంది ఉన్నారు. సడలింపుతో గ్రామాల్లోని 30,741 మంది వరకు బీడీ కార్మికులు ఉపాధి పొందనున్నారు.
నిర్మాణ రంగం
భవన నిర్మాణం రంగానికి సంబంధించిన సామగ్రిని అందించే దుకాణాలన్నింటికి, ఇటుకబట్టీలు, క్రషర్స్, సిమెంట్ పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్థానిక, వలస కార్మికులు 9,670 మంది ఉన్నారు. దీంతో ఆయా రంగాల్లోని కార్మికులకు ఉపాధి లభించనుంది.
ఆంక్షలు ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు ఆంక్షలతో కూడిన సడలింపు ఇచ్చింది. పరిశ్రమలు, దుకాణాలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరచి ఉంచాలి. కార్మికులు తప్పనిసరిగా నిర్ణీత ఎడం పాటించాలి. ముఖానికి మాస్కులు ధరించాలి. కార్మికులకు శానిటైజర్స్ అందుబాటులో ఉంచడం. ఇవి కంపెనీల నిర్వాహకుల బాధ్యత. జిల్లాలోని అయిదు పురపాలక సంఘాల్లోని పరిశ్రమలకు లాక్‌డౌన్ సడలింపు లేదు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
"గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు తెరుచుకోవచ్చు. స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీల్లో పనులు చేసుకోవచ్చు. పనులు చేసే సయమంలో లాక్‌డౌన్ నిబంధనలు తప్పక పాటించాలి. నిబంధనలు పాటించని పక్షంలో ఆయా కంపెనీల యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు కంపెనీలను మూసివేస్తారు."
- రాజేశ్వరమ్మ, జిల్లా సహాయ కార్మికశాఖ కమిషనర్