జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిర్వహించిన రైతుల మహా ధర్నాలో భాగంగా తమ ఇంటిపై జరిగిన దాడిని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఖండించారు. రైతుల ముసుగులో భాజపా, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇంటిపై రాళ్లదాడి చేసినా... పోలీసులు ఆపలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలన్నారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ శిక్షించే అధికారం పోలీసులకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు విజ్ఞప్తి చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోళ్ళను కేంద్రం చేపట్టాలని... ఈ విషయంలో ఎమ్మెల్యేకు ఏమి సంబంధం ఉండదని వెల్లడించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు నష్టం చేకూర్చే విధంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు. భాజపా, కాంగ్రెస్ పార్టీలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.