KCR Kondagattu Tour Updates : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100కోట్లు ప్రకటించామని.. మరో రూ.500కోట్లు (మొత్తం రూ.600కోట్లు) కూడా కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ప్రపంచాన్నే ఆకర్షించే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి : దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే... కొండగట్టు అనే పేరు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రపంచాన్నే ఆకర్షించే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని చెప్పారు.
'దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలి. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. భక్తులకు అన్ని వసతులు, సకల హంగులతో అభివృద్ధి చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారు. ప్రమాదాలకు తావులేకుండా ఘాట్ రోడ్డులను మార్చాలి. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు. పెద్ద వాల్, పుష్కరిణి, అన్నదాన సత్రం, పార్కింగ్ ఏర్పాటు. 86 ఎకరాల్లో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. మళ్లీ వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా.' సీఎం కేసీఆర్
ఇవాళ ఉదయం దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి అంజన్న క్షేత్రానికి వచ్చిన సీఎంకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కొండగట్టు క్షేత్రానికి చేరుకున్న సీఎం.. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు.
ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి అంజన్న క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఇవీ చదవండి: