జగిత్యాల జిల్లా కోరుట్లలోని పురపాలక సంఘ కార్యాలయం పచ్చని చెట్లు, గోడలపై అందమైన చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటోంది. పురపాలక కమిషనర్ అయాజ్ ప్రత్యేక దృష్టి సారించి.. కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కార్యాలయం లోపల, బయట వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. గోడల నిండా రంగురంగుల బొమ్మలతో ప్రజలను ఆకట్టుకుంటూ.. కార్యాలయానికి వచ్చేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నారు.
పచ్చని చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం, ఇంకుడు గుంతలు నిర్మిద్దాం-నీటిని పొదుపుగా వాడుకుందాం లాంటి సూక్తులను గోడలపై రాయించి.. పచ్చదనం, పరిశుభ్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు కార్యాలయ గోడలను.. పచ్చని చెట్లను చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్ల కింద సేదతీరుతూ ఉపశమనం పొందుతున్నారు.
పర్యావరణం, పరిశుభ్రత పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకే కార్యాలయాన్ని ఇలా అందంగా తీర్చిదిద్దినట్లు పురపాలక కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. భవిష్యత్తుల్లో పట్టణంలోని ఇంటింటికీ చెట్లను పంపిణీ చేసి.. పట్టణంలో పచ్చదనం.. పరిశుభ్రత మరింత మెరుగుపడేలా చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి