Heavy Rain: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో వడగళ్ల వాన పడగా.. నూర్పిడి చేసిన ధాన్యం తడిసిపోయింది. ఉదయం వాతావరణం పొడిగా ఉండటంతో.. మార్కెట్ కమిటీలో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. ఒక్కసారిగా వాన కురవగా ధాన్యం నీటిపాలయ్యింది. రైతులు హుటాహుటిన చేరుకొని కవర్లు కప్పినా ఫలితం లేకుండా పోయింది.
జగిత్యాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరిపంట నేలవాలింది. ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. కల్లాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. గొల్లపల్లి రహదారిలో చెట్టుకూలి ఆటోపై పడిపోయి నుజ్జు నుజ్జయ్యింది. భారీ గాలులతో పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు కూలిపోయాయి.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, కోనరావుపేట వివిధ మండలాల్లో వర్షం కారణంగా అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సారంగపూర్, ధర్మపురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వెల్గటూర్, మల్యాల, గంగాధర మండలాల్లో పెద్దఎత్తున వాన పడింది. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం రాశులు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. ఆరబెట్టిన వరిధాన్యం కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. రహదారి పక్కన చెట్టు నేలకూలడంతో ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.
భాగ్యనగరంలో వర్షం: హైదరాబాద్‌లోని బేగంపేట్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, అల్వాల్, లంగర్‌హౌస్, చిలకలగూడ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గోల్కొండ, కార్వాన్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, కవాడి గూడ, విద్యానగర్, భోలక్‌పూర్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, ఏంజె మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో సంధ్యా సమయానికి ముందే చీకట్లు పులుముకున్నాయి. దీంతో వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో ప్రయాణించారు.
ఇవీ చూడండి: భాగ్యనగరం లో ఈదురుగాలులతో కూడిన వర్షం
Today Weather Report: ఉత్తర తెలంగాణకు హెచ్చరిక.. రాష్ట్రంలో మూడ్రోజులపాటు వర్షాలు..!