Mooga Manasula Prema in Instagram: సామాజిక మాధ్యమం వారి భావాలకు వేదికైంది. ఆ మూగమనసులను కలిపింది. ఇద్దరూ దివ్యాంగులు కావడంతో కనీసం వారి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను నోటి ద్వారా చెప్పుకునే అవకాశం లేదు. అయితే వారి బాసలు ఒకరికి చేరవేయడంలో ఇన్‌స్టా గ్రామ్ కీలకంగా మారింది. ఇరువురి మనసులను కలిపి పెళ్లిపీటల మీదకు చేర్చింది. ప్రేమికుల తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో గుడిలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ శివాలయంలో ఇటీవల ఒక్కటైన ఆ ప్రేమ జంట కథ ఇది.
మాటలు రాకున్నా భావాలు బోలెడు
రాయికల్ పట్టణంలో మూగ మనుసుల పెళ్లి వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన అత్రం లత అలియాస్ జ్యోతి, ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన అరుణ్ ఇద్దరూ మూగవారే. ఇన్‌స్టా గ్రామ్ ద్వారా వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. తమలో ఉన్న లోపం కారణంగా తనలా లోపం ఉన్నవారైతేనే మంచి మనసుతో అర్థం చేసుకుంటారని భావించారు. వారికి మాటలు రాకున్నా వారి మధ్య భావాలు మాత్రం బోలెడు. ఆ ప్రేమ భావాలను తమ మనసులో అలాగే బంధించాలనుకోలేదు. అందుకే ఒకరికొకరు ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు. సైగలతో జీవనం సాగించే వారిద్దరూ ఏడడుగులు నడిచారు. మూడుముళ్ల బంధంతో దంపతులయ్యారు.
నెట్టింట వైరల్
పుట్టుకతోనే మాటలు రాకపోవడం, ఇరు కుటుంబీకుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో.. వారిద్దరి వివాహానికి గ్రామస్థులు, పరిచయస్థులు, దాతలు ఆర్థిక సాయం అందించి పెళ్లి జరిపించారు. రాయికల్ శివాలయంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీరి ప్రేమ వివాహాన్ని పలువురు అభినందించారు. వారి పెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగ్గా ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరై అభినందించారు. సామాజిక మాధ్యమాలు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టడమే కాదు.. చిగురించిన ప్రేమను కాస్తా పెళ్లివరకు తీసుకెళ్లగలిగాయని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'చిన్నారుల నిండు జీవితానికి.. రెండు పోలియో చుక్కలు తప్పనిసరి'