జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ శానిటరీ దుకాణంలో సామగ్రి కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన బిల్లు రూ.3 లక్షల 49 వేలు ఈ నెల 13న ఆన్లైన్లో చెల్లించాడు. ఈ క్రమంలో ఆ సొమ్ము ఖాతాలోకి చేరకపోవటం వల్ల దుకాణాదారు... ఎస్బీఐ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేశాడు. నంబర్ బిజీ రావటం వల్ల ఫోన్ పెట్టేశాడు.
కొద్దిసేపటి తర్వాత బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. డబ్బులు ఖాతాలో జమ కావాలంటే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన శ్రీనివాస్.. యాప్ డౌన్లోడ్ చేసుకుని అతను చెప్పినట్లుగా ఖాతా వివరాలు, పిన్‌కోడ్ నెంబరు యాప్‌లో నమోదు చేశాడు.
ఇంత చేసినా శానిటరీ దుకాణానికి డబ్బులు చేరలేదు. అతని ఖాతాకూ తిరిగి డబ్బులు జమకాలేదు. ఫలితంగా బ్యాంకుకి వెళ్లి వివరాలు అడగ్గా.. డబ్బులు ఝార్కండ్లోని ఓ బ్యాంకు ఖాతాకు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్.. జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.