criminal lawyer writing songs: "కాన కానీ కానంటా... బందీకాననంట..." ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన సేనాపతి చిత్రంలో పాత్రల తీరు, కథ, కథనాలను ఆవిష్కరిస్తూ లక్ష్మణ్ గంగా రాసిన పాట ఇది. తెలంగాణలో ఎంతో గొప్ప పేరున్న ఒగ్గు కళారూపంలో ఈ పాటను మలిచిన విధానం సినీ ప్రియులతోపాటు చిత్ర పరిశ్రమలోని గొప్పగొప్ప రచయితల ప్రశంసలందుకుంది. పాటలోని కృష్ణుడి వర్ణనకు ముగ్ధులయ్యారు. ఎవరు ఈ పాట రాసిందని ఆరా తీశారు. తీరా... లక్ష్మణ్ అనే క్రిమినల్ న్యాయవాది రాశారనే విషయం తెలియగానే అందరూ ఆశ్చర్యపోయారు. లక్ష్మణ్ ప్రతిభను ప్రశంసించారు.
విద్యార్థి దశ నుంచే..
ఈ అవకాశాల కోసమే లక్ష్మణ్ గంగా.. తన ప్రయాణాన్ని జగిత్యాల జిల్లాలోని మారుమూల పల్లె కోల్వాయి నుంచి మొదలుపెట్టాడు. ఏడో తరగతి నుంచే సినిమా పాటలకు ప్రాణం పోయాలన్న సంకల్పం లక్ష్మణ్‌లో ఉండేది. విద్యార్థి దశ నుంచే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. తన కృషి ఫలించి 2012లో మన ఊరి సాక్షి అనే చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. సమయం లేదు సమరంలోన ముందుకే నువు సాగు అంటూ పాటతో చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. మొదటి పాటతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు కూడా పెరిగాయి. సున్నితమైన భావాలను పలికిస్తూ ప్రేమపాటలు రాయడంలో లక్ష్మణ్ పట్టుసాధించాడు.
సుమారు 100 పాటలు..
2014లో మళ్లీ రాదోయ్, 2018లో అంతా మన మంచికే చిత్రాల్లో మంచి పాటలు రాశాడు. జరజాజ జాజా... పెదవంచు రాసే లేఖ పాట... లక్ష్మణ్ గంగాను సినీ పరిశ్రమకు మరింత దగ్గర చేసింది. ఆ పాట సామాజిక మాద్యమాల్లోనూ మంచి ఆదరణ పొందింది. ఇప్పటి వరకు ఈ వకీల్‌సాబ్ సుమారు 100 పాటలు రాశాడు. లక్ష్మణ్ రాసిన పాటలను సిద్ శ్రీరామ్, రమ్య నంబియార్, దీపు లాంటి గాయనీగాయకులు ఆలపించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ యువ కవి పురస్కారంతో సత్కరించాయి.
న్యాయవాదిగా మంచి సేవలు..
తన అభిరుచి మేరకు పాటల రచయితగా రాణిస్తున్న లక్ష్మణ్... జీవనోపాధి కోసం న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. రెండు వేర్వేరు వృత్తులే అయినా న్యాయవాదిగా తనకు ఎదురయ్యే అనుభవాలు, పుస్తక విజ్ఞానంతో చక్కటి పాటలు రాస్తూ సినీ పరిశ్రమలోనూ కీలకంగా నిలుస్తున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది పేద విద్యార్థులు, బాధితుల పక్షాన నిలబడి సుమారు 2 వేలకుపైగా కేసులను వాదించి అండగా నిలిచాడు. సామాన్యుడి హక్కును హరించే 41ఏ సీఆర్పీసీ సెక్షన్‌పై పోరాటం చేశాడు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో వెయ్యి మంది న్యాయవాదులతో దీక్ష చేసి ఆ సెక్షన్‌పై కదలిక తీసుకొచ్చాడు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించి లక్ష్మణ్ పోరాటంపై నివేదిక కోరడం తన పనితీరుకు నిదర్శనం.
న్యాయవాదిగా, గేయ రచయితగా రాణిస్తున్న లక్ష్మణ్... తనను పుస్తక విజ్ఞానమే మంచి రచయితను చేసిందని చెప్తాడు. కోర్టుకు వచ్చే కేసుల ప్రేరణే పాటలు రాసేలా చేసిందంటాడు.
ఇదీ చూడండి: