రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. వచ్చిన వెంటనే రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలన్నింటిని తప్పకుండా తెరిపిస్తామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట చక్కెర కర్మాగారం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్న చక్కెర కర్మాగారాన్ని మూసివేసిన ఘనత తెరాసకే దక్కిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీలను తెరిపించి రైతుల కళ్లల్లో సంతోషం నింపుతామన్నారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ నడుచుకుంటున్నారని.. ఫ్యాక్టరీని తిపిస్తానని చెప్పి.. దాని ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా మారిందన్నారు.
అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత తన సొంత లాభం కోసం ఫ్యాక్టరీ మూత పడేలా చేసిందని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ దుయ్యబట్టారు. తెరాస అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాననీ హామీ ఇచ్చిన కవిత మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని మధుయాష్కీ ఎద్దేవా చేశారు.
చక్కెర కర్మాగారాన్ని నమ్ముకున్న వేలాది మంది రైతు కుటుంబాలు నేడు మూతపడ్డ ఫ్యాక్టరీతో రోడ్డున పడ్డాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు రైతులు తగిన బుద్ధి చెప్పాలని జీవన్ రెడ్డి కోరారు. ఇప్పటికైనా రైతులు మోసపూరిత మాటలు వినకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం రైతులకు అండగా ఉండేందుకు బట్టి ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్కకు పలువురు రైతులు నాగళ్ళను బహుకరించారు. పలువురు చెరుకు గడులను అందించారు.
ఇదీ చూడండి : 'మీడీయా వారు పరిశీలించి సీఎంకు చెప్పండి'