మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఎన్నికలు అనివార్యమైన హుజూరాబాద్‌లో 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయిస్తామని వైఎస్ఆర్టీపీ (YSRTP) అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పోరాటమని ఆయన స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం(party office) లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఆరు చోట్ల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షలు చేపట్టారని దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. 7వ నిరుద్యోగ దీక్ష వచ్చే మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తాము చేరికల కోసం పని చేయడం లేదని.. క్యాడర్ని కొత్తగా తయారు చేసే పనిలో ఉన్నామన్నారు. ఇందిరా శోభన్ని నాయకురాలిగా తయారు చేశామని.. ఆమె పార్టీని వీడటం వల్ల ఎలాంటి నష్టం లేదని దేవేందర్ రెడ్డి వివరించారు.
'హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ఉప ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రభుత్వం పని చేస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈ హుజూరాబాద్ ఎన్నికల ద్వారా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఇందుకోసం 100 నుంచి 200 మంది నిరుద్యోగులతో ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 చోట్ల నిరుద్యోగ దీక్షలు చేసిన షర్మిల.. 7వ దీక్ష మంచిర్యాల జిల్లాలో చేస్తారు.'
- తూడి దేవేందర్‌రెడ్డి, వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి
వైఎస్ఆర్టీపీకి ఇందిరా శోభన్ బైబై..
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజనామా చేసినట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీనామా లేఖను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
ఇదీ చూడండి: YSRTP: షర్మిలకు షాక్.. వైతెపాకు ఇందిరాశోభన్ రాజీనామా