ys Sharmila fire on govt : ర్యాలీ, సభలు, సమావేశాలపై నిషేధం విధిస్తూ గత నెల 25న జీవో ఇచ్చినా... నల్గొండ జిల్లాలో ర్యాలీ, సభలు ఎలా పెడతారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. కొవిడ్ నిబంధనలు... కేవలం ప్రతిపక్షాలకేనా...అధికార పార్టీకి వర్తించవా అని ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వరంగల్‌తోపాటు పలు ప్రాంతాలకు చెందిన ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను లోటస్‌పాండ్‌కు పిలిపించి... పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకుని ఆర్థిక సాయం చేశారు.
రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారింది..
తెలంగాణ... రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని షర్మిల ఆరోపించారు. ఏడేళ్ల కాలంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పండిన పంట అమ్ముకోలేక కొందరు, ధరణి సమస్యలతో ఇంకొందరు.. అప్పులతో మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతుబంధు పేరున ఎకరాలకు 5వేలు ఇచ్చి...రైతులకు ఇవ్వాల్సిన 25వేల రాయితీలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత మంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి.... ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తారంటని ఎద్దేవా చేశారు. ఏ మాత్రం నైతికత ఉన్నా... రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా నాయకులు పెద్ద సంఖ్యలో వస్తున్నా... ధాన్యం కొనుగోలు విషయంపై ఏమీ మట్లాడడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సమస్యను పక్కకు నెట్టేందుకు 317 జీవోను తెరపైకి తెచ్చారని విమర్శించారు. రైతులు పండించే ప్రతి గింజా కొనాల్సిందేనని పేర్కొన్నారు.
ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు..
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే ఇక్కడ పార్టీ పెట్టానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో పార్టీ పెడుతున్నారా...అని అడిగిన ప్రశ్నకు.... "ఎవరైనా, ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టొచ్చు.. నా బతుకు ఇక్కడే ముడిపడి ఉంది.. వైఎస్సార్‌ను ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది." అని సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడైనా... ఏదైనా జరగొచ్చని... ఎప్పటికీ అధికారంలో ఉంటారని అనుకోవడం మూర్కత్వమని అన్నారు.
ఇదీ చూడండి: Shivraj Singh Chouhan on KCR: 'కేసీఆర్ లాంటి పిరికి సీఎంను ఎక్కడా చూడలేదు'