ఎంపీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలకంటే ఆయనకు తక్కువ ఓట్లే వచ్చాయి. అలాంటిది ఆయన అక్కడి ఎమ్మెల్యేలను గెలిపించడమేంటి? ఎంపీ అంత గొప్ప వ్యక్తి అయితే సొంత పార్టీ పెట్టుకోవచ్చుగా? మమ్మల్ని గెలిపించిన జగన్ పట్ల ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉంటాం. - మంత్రి పేర్ని నాని
రఘురామకృష్ణరాజు స్పందన: మనం ఒకసారి కలసినపుడు మీరేమన్నారో గుర్తుకు తెచ్చుకోండి నాని. సరే నా ఖర్మో.. మీ ఖర్మో నేను పార్టీలోకి వచ్చా. ఏ మూలనో మా రాజశేఖరరెడ్డి అబ్బాయి జగన్ అనే గౌరవంతో వీళ్లంతా కబురుపెడితే పెద్ద వాళ్లతోనే మాట్లాడా. గౌరవం ఇచ్చి పుచ్చుకోండి.
జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించండని బతిమిలాడారు. జగన్‌తో చెబితే ససేమిరా అన్నారు. ఆయన్ని మేమే ఒప్పించాం. - ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
రఘురామకృష్ణరాజు: కారుమూరి నాగేశ్వరరావును బతిమిలాడానట. ఇళ్ల స్థలాల అక్రమాలలో ఆయనపై 60, 70 ఫిర్యాదులున్నాయి. వీరా మాట్లాడేది?
ఎంపీకి తన స్వగ్రామంలోనే తక్కువ ఓట్లొచ్చాయి. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలి.- మంత్రి శ్రీరంగనాథరాజు
రఘురామకృష్ణరాజు: అసలు నిందితుడు మంత్రి శ్రీరంగనాథరాజే. వాళ్ల ఊళ్లో చేసే అవినీతి అందరికీ తెలుసు.
గతంలోనే ఎంపీ వ్యవహార శైలి నచ్చక ప్రజలు బహిష్కరించారు. మూడు పార్టీలు మారిన ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు.- ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్
రఘురామకృష్ణరాజు: సీఎం అపాయింటుమెంట్ దొరకట్లేదని బాధపడ్డ ఆయనకు ఏ హామీ దొరికిందో ఇలా మాట్లాడుతున్నారు.
సొంత ఎజెండాలు ఉంటే వేరేలా చూసుకోవాలి కానీ పార్టీని విమర్శించే హక్కు ఆయనకు లేదు. బ్యానర్ కట్టే క్యాడర్ కూడా ఆయనకు లేదు.- ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
రఘురామకృష్ణంరాజు: కొట్టు సత్యనారాయణ ఇసుక అక్రమాల సూత్రధారి. నాకు బ్యానర్ కట్టే స్థాయి లేదంటున్నారు. ఎంతమందిని నా ఇంటి చుట్టూ కాపలాకు పంపారు?
సొంతంగా గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేయాలి.-నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు
రఘురామకృష్ణరాజు: ప్రసాదరాజు ఎందుకు, ఎవరికోసం మాట్లాడారో ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది.
మళ్లీ పోటీ చేసి గెలవాలి- జగన్ ఫొటోతో గెలవలేదని చెబుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజు... రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలని ఉండి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు అన్నారు.
ఇదీ చూడండి : మీ త్యాగం మరువం: సైనికులకు సినీతారల నివాళి