Sharmila meet the Governor: తెలంగాణలో కేసీఆర్ రాజ్యంగం అమలు అవుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలోని తాజాగా నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని ఆరోపించిన ఆమె.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు మీడియాకు తెలిపారు. ఇది ఎన్నికల సంవత్సరమైనందున ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతి పక్షాలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ప్రవర్తిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల విధానాలు ఉన్నాయని షర్మిల ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని పలు విమర్శలు చేసిన ఆమె.. హైదరాబాద్‌లోని వీధికుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన కనీసం మున్సిపల్ శాఖ మంత్రి స్పందించలేదని దుయ్యబట్టారు.
పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని మండిపడిన షర్మిల.. తాను పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను గవర్నర్‌కు వివరించినట్లు పేర్కొన్న షర్మిల.. "నడి రోడ్డు మీద లాయర్‌ను నరికి చంపితే ప్రభుత్వం ఏం చేసింది..? పోడు భూముల విషయంలో, మహిళ ఉపాధ్యాయులను పోలీసులు విపరీతంగా కొట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతున్నాయి.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని" ప్రశ్నించారు.
తాను వివరించిన సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ప్రతిపక్ష నాయకులను కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అభిప్రాయపడిన షర్మిల.. త్వరలో రాష్ట్రపతిని కలవనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ వివేకా కేసు గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. సీబీఐ విచారణ తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
"రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది. ప్రతిపక్షాలను అణగ దొక్కుతున్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరాను. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం అయినందున ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం.. ప్రతి పక్షాలపై దాడులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని నమ్మకం లేదు. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్‌ను కోరాను."- వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇవీ చదవండి:
హిజ్రాలకు సారీ చెప్పిన షర్మిల.. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదంటూ..!
పాదయాత్రను ఆపినందుకు కోర్టును ఆశ్రయిస్తా: వైఎస్ షర్మిల
ప్రజల పైసలతో ఆటలా..?... కేంద్రానికి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం