పురపోరులో యువతరం ప్రత్యేక ఆకర్షణ
పురపోరులో కీలకమైన ప్రచార పర్వానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా...సర్వశక్తులూ ఒడ్డేందుకు... నాయకులు తమ బలాలను బలగాలనూ తీసుకొని గల్లీల్లో, వాడల్లో, కాలనీల్లో తిరిగేందుకు సన్నద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే..ఈ పోరులో ప్రత్యేకంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది...యువత. ప్రజాప్రతినిధులుగా నిలబడి సమస్యల్ని తామే పరిష్కరించుకుంటామంటూ యువత కదన రంగంలోకి అడుగుపెట్టింది. పాలకులు ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా గాలికి వదిలేసిన ప్రజా సమస్యలను తాము వేలెత్తిచూపుతామంటోంది. ప్రజల తరుపున ప్రతినిధులుగా నిలబడుతూ... నిలబెడుతూ ప్రత్యేకత చాటుకుంటోంది యువతరం.
రాజకీయాల్లో రాణించేందుకు యువత ఆసక్తి
ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఎన్నికలపై యువత ఆసక్తి కనబరుస్తోంది. ప్రజాసేవ కోసం రాజకీయాలను వేదిక చేసుకుంటోంది. తాజాగా జరగనున్న పురపాలిక ఎన్నికల్లో వారే అత్యధికంగా నామపత్రాలు దాఖలు చేశారు. పుర బరిలో నిలవడమే కాకుండా...గెలిచి తీరుతామంటున్నారు. ప్రజల కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తామని చాటిచెబుతున్నారు. సమర్థమైన రాజకీయాలకు ఆలంబనగా నిలవాలనే సదాశయంతో దాదాపు అన్ని జిల్లాల్లో యువకులు రాజకీయాల్లో రాణించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.
ఓట్లలో..సీట్లలో యువ భాగస్వామ్యం
పట్టణాల ప్రగతి అంతా రేపటి పుర‘పాలకుల’ చేతిలోనే ఉంటుంది. మంచితనం, ముందుచూపున్న నాయకులు... పదవి అనే కుర్చీలో కూర్చుంటేనే పాలన బాగుంటుంది. బల్దియాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఎవరు మంచి అని... ఆలోచన చేసి ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో యువత నిర్ణయం కీలకం. ఓట్లలోనూ.. సీట్లలోనూ యువ భాగస్వామ్యం పెరిగితే ‘నాణ్యమైన’ ఫలితం వస్తుంది.
పురపాలికల్లో నూతనోత్తేజం తీసుకురోవాలి..
యువ తంత్రం... అభివృద్ధికి తారక మంత్రం. వేగం, ఉత్సాహం, కష్టపడేతత్వం, సృజనాత్మకత, తపన, అంకితభావం.. ఇలా ఎన్నో సుగుణాలకు చిరునామా. ఈ నవ యువ లక్షణాలను కొత్తగా ఎన్నికయ్యే పురప్రజాప్రతినిధులు అందిపుచ్చుకోవాలి. జవసత్వాలు కోల్పోయి, నిర్వీర్యంగా ఉన్న పట్టణాల్లో యువసత్వం నింపాలి. మేధాశక్తితో పాలన సాగించాలి. పురపాలికల్ని నవ్యరీతిలో తీర్చిదిద్దాలి... ప్రపంచ స్థాయి పట్టణాలుగా అభివృద్ధి చేసుకోవాలి. సేవే పరమావధిగా అభివృద్ధి దిశగా సాగాలి. ప్రజల అంచనాలకు మించి అన్ని విషయాల్లో మేమున్నామంటూ మార్గదర్శకులుగా నిలవాలి.. పురవాసులకు చేరువై తమదైన పాలనతో చెరగని ముద్ర వేసుకోవాలి.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వేములవాడ, ధర్మపురిలో మున్సిపల్ సందడి