కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోజువారీ కూలీలకు పనులు లేకుండా పోయాయి. రెక్కాడితినే గానీ డొక్కాడని పేద కూలీల పరిస్థితి దినదిన గండంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వీరికి సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు.
యువకుల దాతృత్వం
నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి.. ఆహార పొట్లాలు, నీళ్లు అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. కరోనా కాలంలో రోడ్డు పక్క నివసించే వారు, వైద్యం కోసం ఆస్పత్రులకు వచ్చే వారి కోసం కొందరు యువకులు కలిసి నవ్యశ్రీ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఆహారం, నీళ్లు అందిస్తూ తమ దాతృత్వం చాటుకుంటున్నారు. నగరంలో కూకట్‌పల్లి, నాంపల్లి, అపోలో, నీలోఫర్ ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో పేదలకు ఆహారం అందిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్‌రాజు తెలిపారు.
రెండు పూటలా భోజనం..
ఇదే కోవలో నాంపల్లిలోని గురుద్వార దేవస్థానం ఆధ్వర్యంలో పేదలకు ఆహారం అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి పేదల కడుపు నింపుతున్నారు. ఆహారంతో పాటు కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సైతం అందిస్తున్నట్లు అందులో పనిచేసే నరేంద్రసింగ్ తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న తమకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయడంపై పేదలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: అద్దె కష్టాలు.. బిల్లులు రాక ఆర్టీసీ బస్సుల నిర్వాహకుల తిప్పలు