Story of Yunus Farhan Saeed in Hyderabad : కెమెరాతో ఫొటోలు క్లిక్ మనిపిస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్న యువకుడు పేరు యూనుస్ ఫర్హాన్ సయ్యద్. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తండ్రి వృత్తిరీత్యా ఉర్ధూ పాత్రికేయుడు. 9వ తరగతి చదువుతున్నప్పుడు తట్టిన ఆలోచనలతో క్లౌడ్ ఫొటోగ్రఫీని హాబీగా మలుచుకున్నాడు ఫర్హాన్. క్రమంగా అదే కెరీర్‌గా ఎంచుకుని.. ఎంఏ హిస్టరీ చేశాడు. తద్వారా తన ప్రతిభ, నైపుణ్యాలు మరింత మెరుగు పరుచుకున్నాడు.
Yunus Farhan Saeed Famous Photos : ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. యువకుడు ఖాళీ దొరికితే హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తూ మేఘాల్లో అద్భుతంగా కనిపించే సందేశాత్మ చిత్రాలను క్లిక్ మని ఫోటో తీస్తాడు. అలా ధోనీ సేన గెలిచిన వరల్డ్‌కప్, తెలంగాణ చిత్రపటం, చార్మినార్‌పై కోహినూర్ వజ్రం చిత్రాలను తన మొబైల్‌లో బంధించాడు. ఇలా సమాజంలో జరగబోయే, జరుగుతున్న పలు ఆసక్తికర అంశాల్ని చిత్రాలుగా మేఘాలు తెలియజేస్తున్నాయని చెబుతున్నాడు. దశాబ్ది ఉత్సవాల వేళ ఫర్హాన్ క్లిక్ మనిపించిన తెలంగాణ చిత్రపటాన్ని నగరంలో ప్రదర్శించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతను మేల్కోపేలా తీసిన ఛాయా చిత్రాన్ని సీఐడీ, పోలీస్ అధికారులు ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం తీసుకోవడం వల్ల యువత భవిష్యత్తు ఎలా చిత్తు అవుతుందో ఆ మేఘ సందేశం ద్వారా తెలియజేశాడు.
Drone technology : యువత చూపు డ్రోన్ల వైపు.. ట్రిపుల్ఐటీ కర్నూల్ బూట్‌క్యాంప్
15 సంవత్సరాల్లో 8 వేలకి పైగా ఫొటోలు : ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే అవకాశాలు అవే వస్తాయంటారు చాలామంది చెప్పారని.. తన విషయంలో అదే జరిగిందని అన్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా రాణిస్తోన్న తన నైపుణ్యం చూసి.. తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పిలిపించారు. మేఘాల సందేశాలతో క్రియేట్ చేసిన ఛాయా చిత్రాలను.. రవీంద్రభారతిలో ప్రదర్శన కోసం అవకాశం ఇచ్చారు. దాంతో ఫర్హాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 15 ఏళ్లల్లో దాదాపు 8 వేల పైచిలుకు ఛాయా చిత్రాలు తీశాడు.
మేఘం కూడా ప్రపంచానికి సందేశం ఇస్తుంది: ప్రఖ్యాత లండన్ అప్రిషియేషన్ సొసైటీ సైతం తన క్లౌడ్ ఫొటోలను అభినందిస్తూ ట్వీట్ చేసిందని చెప్పాడు. ఫర్హాన్‌కు వస్తున్న ఆదరణ చూసి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు. మేఘం కూడా ప్రపంచానికి సందేశం ఇస్తోందనే అంశాన్ని బాగా అర్థం చేస్తున్నాడు ఆ యువకుడు. అరుదైన కళను హాబీగా, కెరీగా మలుచుకుని వినూత్నంగా సాగిపోతున్నాడు. ఇప్పటికే పలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి తన ప్రతిభ చాటుకున్నాడు. త్వరలో ఇతర రాష్ట్రాల్లో జాతీయ స్థాయి ప్రదర్శనలు చేయబోతున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్లౌడ్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు హైదరాబాదీ యువకుడు.
"చిన్నప్పుడు నేను మేఘాన్నిఎక్కువగా గమనించేవాడ్ని.. ఏదో సందేశం ఉందని ఆలోచించాను. అప్పటి నుంచి మేఘాలను అర్థం చేసుకుంటూ పరిశోధన చేశాను. అలా ఫొటోలు తీస్తూ.. అదే జీవితం అనుకున్నాను. ఇప్పటికే చాలా ఫొటోలు తీశాను. ప్రతి దాంట్లో ఏదో ఒక సందేశాన్ని గుర్తిస్తున్నాను." - యూనుస్ ఫర్హాన్ సయ్యద్, క్లౌడ్ ఫొటోగ్రాఫర్
ఇవీ చదవండి :