విశాఖ స్టీల్ ప్లాంట్ (visakhapatnam steel plant) అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగేసింది. స్టీల్ ప్లాంట్, అనుబంధ సంస్థలన్నీ వందశాతం విక్రయిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ గనులను సైతం అమ్మేస్తున్నట్లు వెల్లడించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ (Visakhapatnam Steel Plant Privatization Process) వేగవంతం చేసింది. దీనిపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
'విశాఖ స్టీల్ ప్లాంట్ 100 శాతం అమ్మేస్తాం'
స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు, కార్మిక సంఘాల నేతలు నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ అంశంపై మరోసారి ఆలోచించాలని... వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో రాస్తారోకో
కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచాలని కార్మిక నేతలు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో మరింత ఉద్ధృతంగా నిరసనలు చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ వైఖరిపై కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు మండిపడుతున్నారు. పరిశ్రమలో ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ఉద్యమం నడపించాలనే అంశంపై కార్మిక నేతలు ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు.
ఉక్కు ఉద్యమం.. దేశవ్యాప్త కార్మిక సంఘాల మద్దతుకు యత్నాలు
కాగా.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. విశాఖ ఉక్కుతోపాటు అనుబంధ పరిశ్రమల్లో 100 శాతం వాటా విక్రయానికి ఈనెల 28 వరకు బిడ్లు దాఖలుకు అవకాశం ఇచ్చింది. 29వ తేదీన సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు తెలిపింది. ప్రైవేటీకరణ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు న్యాయ సలహాదారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
సొంత గనులు లేకపోవడం వల్లనే..
'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్ధృత పోరాటం ఫలితంగా 1971లో శంకుస్థాపన చేసుకున్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికే 100% వాటాలున్నాయి. సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ.. తర్వాతి కాలంలో తేరుకొని రూ. 21,851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది. నాలుగేళ్లలో 203.6% వృద్ధి సాధించింది. 2010 నవంబరు 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంటు ఇదే.
విశాఖ స్టీలు ప్లాంటు.. 100% ప్రైవేటీకరణ!
ఇదీ నష్టాల చరిత్ర
ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సంస్థ.. 2015 నుంచి వరుస నష్టాల్లో కూరుకుపోయింది. సొంత గనులు లేకపోవడమే అందుకు కారణమని పార్లమెంటు స్థాయి సంఘం గుర్తించింది. ఇప్పుడు ఆ నష్టాల కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడానికి సిద్ధమైంది. సొంత గనులు లేక ముడిసరకునంతా బయటినుంచి కొనాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్‌లో ఇనుప ఖనిజం, బొగ్గు ధరలు పెరగడంతో రూ.4వేల కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆధునికీరణ, విస్తరణ చేపట్టడంతో పెద్దఎత్తున ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. 2018తో పోలిస్తే 2019 జూన్‌నాటికి ఉక్కు ఉత్పత్తి ఖర్చులు దాదాపు 7% పెరిగాయి. సంస్థను లాభాలబాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను కన్సల్టెంటుగా పెట్టుకొన్నారు. వాళ్ల సూచనలు పాటిస్తే నష్టాల నుంచి బయటపడుతుందని అందరూ భావించారు. దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆశించారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: VIZAG STEEL PLANT: విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా మరో అడుగేసిన కేంద్రం