కేంద్ర ప్రభుత్వం సీఏఏ పై వ్యవహరించిన తీరు వల్లే దిల్లీలో ఘర్షణలు తలెత్తాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులు జరిగిన పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. దిల్లీ ఘర్షణల్లో బలైన అమాయకులను ఆదుకోవడానికి తమ పార్టీ నేతృత్వంలో విరాళాల సేకరణ చేపట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని ఈఎస్ఐ కుంభకోణం ఫలితంగా ఉద్యోగులకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. అనేక ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు లేవన్న బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. దీన్ని పరిశీలిస్తే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టమవుతుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని... ఉద్యోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: దిల్లీ అల్లర్లపై మోదీ ఎందుకు మాట్లాడరు?: అసదుద్దీన్