నిత్యం కార్యాలయాలకు ఉరుకులు లేవు.. ట్రాఫిక్ జాం వంటి ఇబ్బందులు లేవు.. ప్రయాణ బడలిక అసలే లేదు.. వెరసి ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం..
ఇది అనేకమంది ఐటీ ఉద్యోగుల మాట. కరోనా వేళ దాదాపు అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని (వర్కు ఫ్రం హోం) చేసేందుకు అవకాశం కల్పించాయి. ఈ నేపథ్యంలో వారి అనుభవాలను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తెలుసుకునే ప్రయత్నం చేసింది. 150 ప్రాజెక్టుల్లో పని చేస్తున్న 500 మందితో నేరుగా, ఫోనులో, ఆన్‌లైన్‌లో అభిప్రాయాలను సేకరించింది. విధులు కొనసాగుతున్న తీరుతో పాటు.. దీనిని కొనసాగిస్తే ఎలా ఉంటుందనే విషయమై సర్వే చేసింది.
బంధాలు బాగున్నాయ్
వర్కు ఫ్రమ్ హోం వేళ దంపతుల మధ్య అనుబంధం ఎలా ఉందనే ప్రశ్నకు 88.54 శాతం మంది బాగుందని సమాధానం చెప్పారు. బంధాలు బాగున్నప్పుడే బాధ్యతలు బాగా నిర్వహిస్తారని.. పనితనం పెరుగుతుందనే అంశాలు ఈ కరోనా వేళ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇదే విషయాన్ని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల చెబుతూ ‘‘మరిన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంటి నుంచి పని కొనసాగించేందుకు ఎక్కువమంది టెక్కీలు మక్కువ చూపుతారు. అంతే కాదు విదేశాల్లో ప్రాజెక్టుల విషయంలో అత్యంత ఆసక్తి చూపే టెక్కీలు ఇప్పుడు ఆ దిశగా ఆలోచించడంలేదు’’ అని పేర్కొన్నారు.
ఊరెళ్లింది 21.87 శాతమే
లాక్‌డౌన్ వేళ ఐటీ ఉద్యోగులు సొంతూరు (పల్లె) బాట పట్టింది 21.87 శాతం మందే. మెట్రో నగరాల్లో 41.66 శాతం ఉండి పనిచేస్తుండగా 31.25 శాతం మంది పట్టణ ప్రాంతాలు, 21.87 శాతం మంది మున్సిపల్ నగరాల నుంచి విధులు చేస్తున్నట్టు టీటా సర్వేలో తేలింది.
పని గంటలు పెరిగాయి..
వర్కు ఫ్రమ్ హోంతో 8 నుంచి 10 గంటలు పని చేయాల్సి వస్తోందని 48.95 శాతం చెప్పగా.. 10-12 గంటలు చేసేవారి సంఖ్య 28.12 శాతం, 8 గంటలు పని చేసేవారు 12.5 శాతం ఉన్నారు. కరోనా వేళ ప్రత్యేక పారితోషికం ఇచ్చిన సంస్థలు 8.33 శాతం ఉన్నాయని తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు